దేశంలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. రోజూ లక్షల్లో కొత్త కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం కేంద్రం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది.
ఈ క్రమంలోనే కరోనా బాధితుల కోసం గత ఏడాది జూలైలో జారీ చేసిన మార్గదర్శకాల్లో పలు మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
కరోనా పాజిటివ్ అని తేలితే.. స్వల్ప లక్షణాలున్నా, లక్షణాలు లేకున్నా ఇంట్లోనే ఉండాలని సూచించింది.
- హోంఐసోలేషన్ రోగులకు కేర్‌టేకర్ ఉండాల్సిందే
- కుటుంబ సభ్యులు.. హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడటం మంచిది
- రోగులు, కుటుంబీకులు మూడు పొరల మాస్కులు ధరించడం మేలు
- పది రోజుల తర్వాత రోగులు ఐసోలేషన్ నుంచి బయటకు రావొచ్చు
హోం ఐసోలేషన్ వారి కోసం కేంద్రం కొత్త మార్గదర్శకాలు
చివరి 3 రోజుల్లో జ్వరం లేకుంటే టెస్టు వద్దు
దేశవ్యాప్తంగా కరోనా తీవ్రరూపం దాల్చడంతో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కొవిడ్-19 లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్నవారితో పాటు హోం ఐసోలేషన్‌లో ఉన్నవారి కోసం ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. హోం ఐసోలేషన్ నుంచి పది రోజుల తర్వాత బయటకు రావొచ్చని, చివరి మూడు రోజుల్లో జ్వరం రాకపోతే పరీక్ష అవసరంలేదని కేంద్రం ఈ మార్గ్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
ఐసోలేషన్లో ఎవరు ఉండాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
- స్వల్ప లక్షణాలు లేదా లక్షణాలు లేని రోగులు హోం ఐసోలేషన్‌లో ఉండాలి. ఈ విషయాన్ని వైద్యులు ధ్రువీకరించాలి.
- రోగులు ఇంటికే పరిమితమవ్వాలి. బయటకు రావొద్దు.
- ఐసోలేషన్‌లో ఉండేవారికి సహాయం అందించేందుకు అన్నివేళలా కేర్‌టేకర్ ఉండాలి.
- ఐసోలేషన్ ముగిసేంతవరకూ రోగికి సంబంధించిన చికిత్స కోసం కేర్‌టేకర్‌కు, ఏదైనా దవాఖాన సిబ్బందికి మధ్య అనుసంధానం ఉండాలి. రోగుల ఆక్సిజన్ స్థాయిలు ఎప్పటికప్పుడు పరీక్షించాలి.
- 60 ఏండ్లు పైబడిన వారిని, రక్తపోటు, మధుమేహం, గుండె సమస్యలు, ఊపిరితిత్తులు/కాలేయం/మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు, సెరెబ్రో-వస్కులర్ వ్యాధులు ఉన్నవారిని వైద్యులు అనుమతించిన తర్వాతనే హోంఐసోలేషన్‌లో ఉంచాలి.
- రోగికి సాయం చేసే కేర్‌టేకర్, కుటుంబ సభ్యులు.. వైద్యుల సలహాతో హైడ్రాక్సీక్లోరోక్విన్, ప్రోపిలాక్సీస్ ఔషధాలను వాడాలి.
ఇవి చేయండి!
- రోగులు గోరువెచ్చని నీటిని పుక్కిలించడం, రోజుకు రెండుసార్లు ఆవిరి పట్టడం చేయాలి.
- ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు సంబంధిత వైద్యుని సలహాతో మందులు వాడాలి.
- రోజుకు 4సార్లు పారాసెటమాల్ 650 ఎంజీ వాడినప్పటికీ జ్వరం తగ్గకపోతే వైద్యున్ని సంప్రదించాలి. నాన్-స్టెరాయిడల్ యాంటీ-ఇన్‌ఫ్లెమేటరీ డ్రగ్ (ఎన్‌ఎస్‌ఏఐడీ) (ఉదాహరణకు.. రోజుకు 2సార్లు నెప్రోక్సెన్ 250 ఎంజీ)ను వైద్యులు ఇవ్వొచ్చు.
- బాధితులు, కేర్‌టేకర్లు మూడు పొరల మాస్కు వాడకం మంచిది. రోగులు వీలైనంత ఎక్కువగా నీరు, ద్రవ ఆహారం తీసుకోవాలి.
- తేలికపాటి లక్షణాలుంటే నోటి ద్వారా స్టెరాయిడ్లు తీసుకోవద్దు. వారం రోజులైనా జ్వరం, దగ్గు ఉంటే వైద్యున్ని సంప్రదించాలి.
- పది రోజుల అనంతరం హోంఐసోలేషన్ నుంచి బయటకు రావొచ్చు. చివరి మూడు రోజుల్లో జ్వరం లేకపోతే పరీక్ష అవసరంలేదు.