కరోనా వైరస్ నానాటికీ విజృంభిస్తోంది. అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేశారు. జనాలు కూడా కొవిడ్-19 బారిన పడొద్దని వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు.. అయినా ఇంకా చాలామందిలో ఏవేవో అనుమానాలు ! టీకా వేయించుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయోననే భయం కొందరిలో ఉంటే.. కొవిడ్-19 టీకా తీసుకున్న తర్వాత ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి? కరోనా వ్యాక్సిన్ తీసుకునే ముందు ఎలాంటి ఆహారం తినాలి ? ఏం తినకూడదని సందేహాలు మరికొందరిలో ఉన్నాయి. అయితే కొన్ని ఆహార నియమాలను పాటిస్తే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌ను సమర్థంగా ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో చూద్దామా..
నీళ్లు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది
కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు, తర్వాత నీళ్లు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. నీటిని ఎక్కువగా తాగడంతో పాటు నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు తినడం వల్ల శరీరంలోని నీటి స్థాయులు పెరుగుతాయి. తద్వారా నీరసం తగ్గి పునరుత్తేజం కావడంతో పాటు రోగ నిరోధక వ్యవస్థ పనితీరు కూడా మెరుగవుతుంది. ఫలితంగా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.
ఆల్కహాల్ తీసుకోవద్దు
ఆల్కహాల్ సేవించే వారు టీకా తీసుకోవడానికి కొన్ని వారాల ముందు నుంచి, తీసుకున్న తర్వాత కొన్ని రోజుల వరకు మందు తాగకపోవడమే మంచిది. ఎందుకంటే టీకా తీసుకున్న తర్వాత శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. కానీ ఆల్కహాల్ డ్రింక్ చేస్తే శరీరం తొందరగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఇమ్యూనిటీ తగ్గిపోతే.. సైడ్ ఎఫెక్ట్స్‌ను ఎదుర్కొనే శక్తి తగ్గిపోతుంది.
ప్రాసెస్‌డ్ ఫుడ్ వద్దు
ఈ కరోనా సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. అదే ప్రాసెస్‌డ్ ఫుడ్స్ తీసుకుంటే.. అందులో ఉండే అధిక క్యాలరీలు, సంతృప్త కొవ్వులు రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. తద్వారా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్‌ను తట్టుకునే శక్తి క్షీణిస్తుంది. అందుకే ప్రాసెస్‌డ్ ఫుడ్ బదులు అధిక ఫైబర్ ఉండే గోధుమలను ఆహారంగా తీసుకోవడం మంచిది.
చక్కెర పదార్థాలు తినొద్దు
కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు, తీసుకున్న తర్వాత విశ్రాంతి చాలా అవసరం. ఎంత ఎక్కువ నిద్రపోతే అంత చురుగ్గా ఉంటాం. కాబట్టి ఈ సమయంలో సంతృప్త కొవ్వులు, చక్కెరస్థాయులు ఎక్కువ ఉన్న ఆహారాన్ని దూరం పెట్టాలి. ఎందుకంటే చక్కెర అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఒత్తిడి, యాంగ్జైటీ పెరిగిపోతుంది. దీంతో నిద్ర సరిగ్గా పట్టక.. సరైన విశ్రాంతి ఉండదు. వీలైనంత వరకు అధిక ఫైబర్ ఉండే ఆహారమే తీసుకోవాలి.
సమతుల్య ఆహారం తీసుకోవాలి
వ్యాక్సిన్ తీసుకున్న వారిలో చాలామందిలో అలసట, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ దుష్ప్రభావాల నుంచి బయట పడాలంటే శరీరానికి శక్తినిచ్చే, రోగ నిరోధక శక్తిని పెంచే సమతుల్య ఆహారం తీసుకోవడం మంచిది. ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తినాలి. ప్రాసెస్‌డ్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.