శ్వాసకోశ వ్యాధుల నివారణకు భుజంగాసనం మంచి మేలు చేస్తుంది. ఈ ఆసనం ఎలా వేయాలో తెలుసుకుందాం.
ప్రశాంతమైన గదిలో ఒక మెత్తని దుప్పటి పరుచుకోవాలి. దానిపై నెమ్మదిగా బోర్లా పడుకోవాలి. గడ్డాన్ని నేలకు ఆనించి ఉంచి చేతులను ఛాతీ ప్రక్కన అరచేతులు ఆని ఉండేటట్లుగా మోచేతులు పైకి ఉండేటట్లు ఏర్పరుచుకోవాలి.
బారుగా చాపిన పాదాలు ఒకదానికొకటి ఆని ఉండేటట్లు ఉంచుకోవాలి. అనంతరం నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ బరువును అరచేతులపై ఉంచి ఛాతీని తద్వారా మెడను బాగా పైకి లేపాలి.
తలను బాగా పైకెత్తి పైకి ఆకాశం వంక చూస్తున్నట్లు ఉంచుకోవాలి. ఈ భంగిమలో వెన్ను చక్కగా అర్థచంద్రాకారంలాగా వెనుకకు వంగి ఉంటుంది. ఇలా ఎవరి అవకాశాన్ని బట్టి వారు ఛాతీని పైకి లేపాలి.
లేదంటే బొడ్డును కొలమానంగా ఉంచుకుని నాభి వరకూ నడుము నుంచి పొట్ట, ఛాతీ లేపాలి. ఈ సమయంలో చేతులను నిటారుగా లేపి ఉంచేకంటే కొంచెం వంచి ఉంచడం మంచిది. ఇలా చెయ్యడం వలన భుజాలు, చేతులు కూడా శక్తివంతమవుతాయి.
ఇది సర్పం శిరస్సు లేపి పడగ విప్పి ఆడినట్లు ఉంటుంది కాబట్టి భుజంగాసనం అన్నారు. దీనిలో శ్వాస నియమం శరీర భాగాలు విప్పారుతాయి. కాబట్టి శ్వాస తీసుకుంటూ భంగిమకు వచ్చి పూర్ణస్థితిలో ఉండాలి. ఇలా ఉండగలిగినంతసేపు ఉండవచ్చు.
ఈ విధంగా ఈ ఆసనాన్ని మూడునాలుగుసార్లు చేయవచ్చు. అనంతరం రెండు భుజాల మీద అంటే కుడి భుజము మీద ఎడమ చేతిని ఎడమ భుజము మీద కుడిచేతిని ఉంచి దానిపై గడ్డాన్ని ఉంచి విశ్రాంతిని తీసుకోవాలి.
దీన్ని ఎవరెవరు చెయ్యకూడదు…?
గర్భం ధరించిన స్త్రీలు ఈ ఆసనాన్ని వేయకూడదు. పొట్టకు వత్తిడి తగిలేది కనుక వేయరాదు. అలాగే వెన్నుకు సంబంధించి ఏవైనా ఇంజెక్షన్లు, ఆపరేషన్లు వంటివేవైనా జరిగినవారు కూడా చేయకూడదు. మిగిలినవారు స్త్రీ, పురుషులు చిన్నపిల్లల దగ్గర్నుంచి వృద్ధాప్యం వరకూ ఎవరైనా ఈ ఆసనాన్ని వేయవచ్చు.
ఉపయోగాలు…
ఈ ఆసనం వల్ల గొంతు దగ్గర ఉండే థైరాయిడ్ కు మంచి ప్రయోజనం కలుగుతుంది. సర్వైకిల్ స్పాండిలైటిస్ అనే మెడకు సంబంధించిన వ్యాధి రాకుండా ఉంటుంది. వచ్చినా తగ్గిస్తుంది. ఊపిరితిత్తులు వ్యాకోచం చెంది శ్వాస బాగా ఆడటం వల్ల శ్వాస సంబంధమైన వ్యాధులను నిరోధించవచ్చు.
శరీరం చాలా శక్తివంతంగా మారుతుంది. వెన్నుగా బాగా శక్తి వచ్చి వెన్నులోని డిస్కుల సమస్యలు తగ్గుతాయి. బొడ్డు వరకూ బాగా లేపి సాధన చేయడం వల్ల పొట్ట కండరాలన్నీ వ్యాకోచం చెంది అక్కడి అవయవాలు, జీర్ణాశయం చురుగ్గా పనిచేస్తాయి.