ఏది నిజం? ఏది అబద్ధం? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. డిజిటల్ యుగంలో సమాచారం ఉప్పెనలా నిత్యం ముంచెత్తుతుంటుంది. ఇందులో నిజం ఏమిటన్నది తేల్చుకోవటం కష్టంగా మారింది. ఆ మాటకు వస్తే.. నిజం కంటే అబద్ధమే అందంగా ఉండి.. ఇట్టే నమ్మేసేలా ఉంటోంది. వ్యాక్సిన్ మీద జరుగుతున్న దుష్ప్రచారమే దీనికి నిదర్శనం. ఫలానా వ్యాక్సిన్ వేయించుకోండి. ఫలానా టీకా మంచిది కాదన్న ప్రచారంతో పాటు.. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కరోనా టెస్టుచేయించుకుంటే పాజిటివ్ వస్తుంది.. దాన్ని పట్టించుకోవద్దు లాంటి ప్రచారం బోలెడంత జరుగుతోంది.
సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ లింకుల ద్వారా అందే ఈ తరహా సమాచారంలో నిజం.. అబద్ధం కలిసిపోయి ఉంటాయి. అందుకే.. కేర్ ఫుల్ గా చూసుకోవాలి. నమ్మే ప్రతి విషయాన్ని క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేసులు పెరిగిపోతున్న వేళ.. వ్యాక్సిన్ వేయించుకోవటం చాలా అవసరం. ఇంతకీ.. వ్యాక్సిన్ మీద జరిగే ప్రచారాల్లో కొన్ని అపోహలు ఉన్నాయి. అలాంటి వాటికి చెక్ పెట్టటమే ఈ వార్త ఉద్దేశం.
వ్యాక్సిన్ ఎవరు వేసుకోవాలి? ఎవరు వేసుకోకూడదు?
స్టెరాయిడ్స్.. హెచ్ఐవీ..ఇమ్యునోసప్రెసెంట్స్ మందులు వాడే వారు టీకా వేయించుకోకూడదు. స్టెరాయిడ్స్ ను నోటి ద్వారా.. ఇంజెక్షన్ ల ద్వారా వాడే వారు టీకాకు దూరంగా ఉండాలి. ఒకవేళ వ్యాక్సిన్ వేయించుకున్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు.వారిలో యాంటీబాడీలు డెవలప్ కావు. అలర్జీ ఉన్నవారు మందులు వాడుతుంటే.. వారు కూడా టీకా తీసుకోకూడదు. మానసిక సమస్యలు ఉన్న వారు.. గర్భవతులు కూడా వ్యాక్సిన్ తీసుకోవద్దు.
స్టెరాయిడ్ వాడే వారు టీకా తీసుకోవాలంటే?
ఇలాంటి వారు తమ డాక్టర్ ను సంప్రదించి.. వారి సలహాతోనే టీకా తీసుకోవాలి. టీకా వేయించుకోవటం కోసం స్టెరాయిడ్స్ వాడటాన్ని ఆపేస్తే.. సదరు వ్యక్తి రోగం మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే.. రోగి లక్షణం.. దాని తీవ్రత సదరు వైద్యుడికి తెలిసే అవకాశం ఉంది కాబట్టి.. వారి సూచనతో మాత్రమే టీకా వేయించుకోవాలి.
కరోనా వచ్చిన వారు టీకా వేసుకుంటే డేంజరా? కరోనాసోకిన తర్వాత ఎంతకాలానికి టీకా వేసుకోవచ్చు?
కరోనా వచ్చిన వారు టీకా వేయించుకుంటే ఎలాంటి డేంజర్ లేదు. అపాయం అంతకన్నా కాదు. అదుర్దాకు గురికావొద్దు. కరోనా సోకి తగ్గిన వారు.. నెల నుంచి రెండు నెలల తర్వాత టీకా వేసుకుంటే పరిపోతుంది.
టీకా తర్వాత కరోనా నిర్దారణ పరీక్ష చేస్తే పాజిటివ్ అని వస్తుందా?
ఈ ప్రచారాన్ని నమ్మొద్దు. అందులో నిజం లేదు. ఇది పచ్చి అబద్ధం. అలా అయితే.. అందరికి వైరస్ సోకుతుంది కదా? టీకా వేసుకోవటానికి ముందు కానీ.. తర్వాత కానీ శరీరంలోకి వైరస్ ప్రవేశిస్తే పాజిటివ్ గా తేలుతుంది. వ్యాక్సినేషన్ తో పాజిటివ్ రాదు.
వ్యాక్సిన్ ఏ చేతికి వేయించుకోవాలి? వేసుకున్న తర్వాత మామూలు ఇంజెక్షన్ మాదిరి రద్దుకోవాలా? బాగా నొప్పిగా ఉంటే ఏం చేయాలి?
ఏ చేతికైనా వేసుకోవచ్చు. కాకుంటే.. ఎడమ చేతికి ఎక్కువ మంది వేస్తారు. అలా అని కుడి చేతికి వేసుకోకూడదని కాదు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మామూలుఇంజెక్షన్ మాదిరి చేతిని రుద్దకూడదు. బాగా నొప్పిగా ఉంటే.. ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. నొప్పిగా ఉంది కదా అని ఐస్ పెట్టటం లాంటివి చేయొద్దు.
మొదటి డోస్ ఒక కంపెనీది.. రెండో డోస్ రెండో కంపెనీ వ్యాక్సిన్ వేసుకోవచ్చా?
అస్సలు వేసుకోకూడదు. అదెంత మాత్రం కరెక్టు కాదు. టీకా వేసుకోవటానికిరెండు రోజుల ముందు.. వేసుకున్న మూడు రోజుల తర్వాత మద్యం.. సిగిరెట్ తాగే అలవాటును మానుకోవాలి. రెండో డోస్ వేసుకునే సమయానికి జ్వరం లాంటిది వస్తే.. అది తగ్గిన తర్వాతే టీకా వేసుకోవాలి.