To lose weight / stomach
To lose weight / stomach

అన్నివర్గాలకు చెందిన ఆహారాలను తీసుకుంటుండాలి. ఒకే రకం ఆహారానికే పరిమితం కాకూడదు. దీనినే షడ్రసోపేతమైన ఆహారం అంటుంది ఆయుర్వేదం. ఆహారంలో పిండి పదార్థాలను 60 శాతం, మాంసకృత్తులు 20 శాతం, కొవ్వు పదార్థాలు 20 శాతం ఉండేలా చూసుకోవాలి. ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి. మాంసాహారులైతే ఎర్రని మంసానికి బదులు తెల్లని మాంసం ఎంచుకోవాలి. అంటే మేక, గొర్రె, పోర్క్, బీఫ్‌కు బదులు చర్మం తొలగించిన కోడి, చేపల మాంసం తినాలి. గుజ్జు కలిగిన తియ్యని పండ్లు, డ్రైఫ్రూట్స్ బదులు రసం కలిగిన తాజా పండ్లు తీసుకోవాలి.

ఆహార పదార్థాలను ఫ్రై (నూనెలో వేయించటం) చేసే బదులు రోస్ట్ (నిప్పుల మీద వేడి చేయటం) చేయాలి. ఎక్కువ నూనెను వాడాల్సిన వంట పాత్రల బదులు మూకుడు, ఓవెన్, నాన్‌స్టిక్ ఫ్రయింగ్ ప్యాన్, ప్రెషర్ కుక్కర్ వంటివి వాడాలి. కూల్ డ్రింక్స్, టీ, కాఫీ తాగే బదులు మినరల్ వాటర్, బబుల్ వాటర్, డైట్ డ్రింక్స్ తీసుకోవాలి. వడ్డనకు పెద్ద గరిటెలు, వెడల్పాటి ప్లేట్లు వాడే బదులు చిన్నసైజ్ టేబుల్ స్పూన్లు, చిన్నప్లేట్లు వాడాలి.

నెమ్మదిగా తినాలి

ఆత్రంగా, గబగబా తింటే ఎంత తిన్నారో, ఏమి తిన్నారో తెలియక ఎక్కువ తినే అవకాశం ఉంటుంది. కనుక నెమ్మదిగా ప్రతి ముద్దనూ నమిలి, రుచిని ఆస్వాదిస్తూ తినాలి. దీంతో లాలాజలం విడుదలై ఆహారం బాగా జీర్ణమవుతుంది. ఒకవేళ నెమ్మదిగా తినలేకపోతే అలవాటయ్యేంతవరకూ స్పూన్‌తో తినాలి. ప్రతి ముద్దకూ చెంచాను కంచంలో విడిచిపెట్టి మళ్లీ తీసుకుంటూ ఉండాలి. ఆహారం తినేటప్పుడు చక్కని ఆహ్లాదకరమైన సంగీతం వింటూ తింటే నెమ్మదిగా తినడం అలవాటవుతుంది. దీంతో తిన్న ఆహారం పూర్తిగా పచనం చెంది శక్తిగా మారుతుంది. వేళ పట్టున తక్కువ మొత్లాల్లో తినాలి బయట ఫంక్షన్లకూ, రెస్టారెంట్లకూ వెళ్ళేటప్పుడు చాలామంది పార్టీలో ఎలానూ తినాల్సి వస్తుంది కదా అనుకొని ఇంట్లో ఏదీ తీసుకోరు. అయితే బరువు పెరగకుండా ఉండాలంటే పార్టీలకు వెళ్ళబోయేముందు ఇంట్లో మజ్జిగన్నం వంటివి తిని వెళ్లాలి. దీంతో పార్టీలో తిన్నప్పటికీ పేగులు ఎక్కువగా స్వీకరించవు. అలాగే రోజువారీగా తేలికగా ఉండే లఘు ఆహారాన్ని తింటూ ఉండాలి. ఉపవాసాలుండకూడదు. లెక్క ప్రకారం తినాలి. వీలైతే ‘్ఫడ్ డైరీ’ రాయాలి. తినేటప్పుడు వేరే పనిమీద దృష్టిపెట్టకూడదు. మాట్లాడుకుంటూ, టీవీ చూస్తూ, చదువుతూ తినకూడదు. ఆహారాన్ని పెద్దమొత్తాల్లో తక్కువసార్లు కాకుండా చిన్నమొత్తాల్లో ఎక్కువసార్లు తీసుకోవాలి. ప్రధాన ఆహారపు వేళల మధ్యలో చిరుతిండ్లు తినకూడదు. అయితే, అవసరమనుకుంటే ద్రాక్షపండ్లు, జామపండ్లు వంటివి తినవచ్చు. ఇవి మలనిర్హణ సజావుగా జరగడానికి సహకరిస్తాయి. మధ్యాహ్నం పూట తీసుకునే ఆహారం ఎక్కువగానూ, రాత్రి పూట తీసుకునే ఆహారం అల్పమోతాదులోనూ ఉండాలి.

తేనెను వాడితే మంచిది

తేనె తీసుకుంటే స్థూలకాయంలో చక్కని ఫలితం కనిపిస్తుంది. కాకపోతే ఏడాది కాలంపాటు నిల్వ ఉంచిన పాత తేనెను వాడాలని ఆయుర్వేదం సూచిస్తుది. పాత తేనెకు రూక్షం (స్నిగ్దత్వాన్ని తగ్గించటం), గ్రాహ (ద్రవరూపస్రావాలను ఎండిపోయేలా చేయటం), లేఖనం (కొవ్వును గీరేసి వదులయ్యేలా చేయటం), కఫ హరం (శే్లష్మాన్ని తగ్గించడం) అనే గుణాలు ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం గ్లాసు గోరువెచ్చని నీళ్ళకు రెండు చెంచాలు తేనెను చేర్చి తీసుకోవాలి. తేనెను నీళ్లకుచేర్చి తీసుకోవటంవల్ల వ్యాయామ సమయంలో నీరసం రాకుండా ఉంటుంది. అవసరమైతే ఈ విశ్రమానికి చెక్క నిమ్మరసం కూడా చేర్చి తీసుకోవచ్చు.

శూకధాన్యం మంచిది

యవగోధుమలు, బార్లి, ఓట్స్ వంటి వాటిని శూకధాన్యం (సిరియల్స్) అంటారు. వీటిల్లో అధిక మొత్తాల్లో పీచు పదార్థం ఉంటుంది. ఇది కొవ్వును పేరుకుపోకుండా చేస్తుంది. పీచు పదార్థం శక్తిని నిలకడగా విడుదలయ్యేలా చేస్తుంది. నీటిని పీల్చుకుంటుంది కాబట్టి అంత త్వరగా ఆకలి వెయ్యదు. పీచువల్ల మల, మూత్రాల నిర్హరణ సజావుగా జరుగుతుంది. అలాగే ఫైబర్ కొలెస్టరాల్‌ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

పాత బియ్యం హితకరం

ఏడాదిపాటు పాతబడిన బియ్యాన్ని వాడుకుంటే స్థూలకాయంలో హితకరంగా ఉంటుంది. అయితే మరీ పాత బియ్యం వాడితే శోథ(వాపు) వస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. బియ్యాన్ని నేరుగా కాకుండా కృతాన్నం రూపం తీసుకోవాలి. ఉడికించిన బియ్యానికి పప్పు, కాయగూరలు వంటివి చేర్చడాన్ని కృతాన్నం అంటారు. కొత్త బియ్యం వాడితే కఫం పెరిగి లావెక్కుతారు. కనుక స్థూలకాయులు వాడకూడదు.

మేలు చేసే ఆహారాలు తీసుకోవాలి

శమీధాన్యంలో (పప్పుదినుసుల్లో) మాంసకృతులు, పీచు అధికంగా ఉంటాయి. పెసర్లు లఘువుగా ఉంటాయి కనుక మంచివి. అలాగే ఉసిరి, పొట్ల, ఆకుకూరలు అన్నీ మంచివే. శొంఠి, పిప్పళ్లు, మిరియాలు వంటివి హితకరంగా ఉంటాయి. జీలకఱ్ఱ, ధనియాలు, సోంపు గింజలు, ఏలక్కాయలు, అల్లం, దాల్చిన చెక్క వంటివి ఆహారంలో ఎక్కువగా ఉపయోంచాలి. అయితే మినుములు గురువుగా ఉంటాయి కనుక స్థూలకాయులు వాడకూడదు.వేడినీళ్ళతో అద్భుతం- వేడినీళ్లు తాగితే సన్నబడతారు. వేడినీళ్ళ స్నానమూ మంచిదే. స్థూలకాయులు చన్నీళ్లు వాడకూడదు.ఆహారానికి ముందు నీళ్లు తాగాలి- ఆహారానికి ముందు 2 గ్లాసులు నీళ్లు తాగితే సన్నబడతారని ఆయుర్వేద సంహితా గ్రంథంలో అష్టాంగ హృదయం చెబుతుంది. ఆహారం తీసుకున్న వెంటనే మంచినీళ్ళు తాగితే లావెక్కుతారు కనుక కనీసం అరగంట వరకూ ఆగాలి.

మజ్జిగ మేలు చేస్తుంది

మజ్జిగ తేలిగా ఉంటుంది. అలాగే ఊబ శరీరాన్ని ఎండిపోయేలా చేస్తుంది. మజ్జిక తీపి, పులుపు, వగరు రుచులు కలిగి ఉంటుంది. ఈ రుచులు ఉండటంవల్ల ఇది త్రిదోషహరంగా పనిచేస్తుంది. పులుపువల్ల వాతం, తీపివల్ల పిత్తం, కషాయంవల్ల కఫం తగ్గుతాయి. మజ్జిగను వాతాధిక్యతలో (నొప్పులు, గ్యాస్ ఉన్నప్పుడు) సైంధవ లవణంతోను, పిత్త్ధాక్యతలో (మంటలు, జీర్ణక్రియా సమస్యలు ఉన్నప్పుడు) మిశ్రీతోను, కఫాధిక్యతలో (జలుబు వంటివి ఉన్నప్పుడు) త్రికటుచూర్ణంతోను తీసుకోవాలి. అయితే మజ్జిగను వెన్న తీసి మాత్రమే వాడాలి.చింతనతో స్థూలకాయ చింత దూరం శరీరంలో అధికంగా కొవ్వు చేరకుండా ఉండాలంటే అనుక్షణం చింత (ఆలోచన) చేయాలని ఆయుర్వేదం చెబుతుంది. బాధ్యతారహితమైన జీవన విధానంవల్ల స్థూలకాయం సిద్ధిస్తుంది.

వ్యాయామం చేయటం అవసరం

స్థూలకాయం రాకుండా ఉండాలంటే ప్రతినిత్యం అర్ధశక్తిగా వ్యాయామం చేయాలని ఆయుర్వేదం సూచిస్తుంది. యోగాసనాలు, సైక్లింగ్, నడక, ప్రాణాయామం, ఈత, క్రీడలు, జిమ్, ఎయిరోబిక్స్ వంటి వాటిల్లో ఏది అనువుగా వుంటే దానిని ఎంచుకొని సాధన చేయాలి. వ్యాయామం తరువాత చన్నీళ్లు తాగవద్దు చాలామంది వ్యాయామం చేసిన తరువాత అలుపు తీర్చుకునేందుకు చన్నీళ్ళు తాగుతుంటారు. అయితే, చన్నీళ్ళుగాని, లేదా తలపానీయాలుగాని జీవక్రియను ఆలస్యం చేసి స్థూలకాయానికి కారణమవుతాయి. అవసరమైతే వేడినీళ్ళనుగాని లేదా వేడిగా తయారుచేసిన శొంఠి కషాయం వంటి మూలికాపానీయాలను గాని తాగవచ్చు. ఆరోగ్యకరమైన దాంపత్య జీవితం ముఖ్యం నిద్ర, ఆహారం, మైథునం అనే మూడు స్తంభాలు మనిషి శరీరాన్ని ముక్కాలిపీటలాగా నిలబెడతాయని అంటుంది ఆయుర్వేదం. స్తంభాల ఎత్తులో హెచ్చుతగ్గులుంటే ఏ విధంగా మంటపం నిలబడదో అదేవిధంగా మనిషి శరీరం కూడా పతనమవుతుంది. కనుక వీటిని పరిమితంగా ఆస్వాదించాలి. మైథునంవల్ల ఉదాసీనత దూరమై చలాకీతనం వస్తుంది. బరువు నియంత్రణలో ఉంటుంది.

– డాక్టర్ చిరుమామిళ్ల మురళీమనోహర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here