దైనందిన జీవనశైలిలోనే ఆయుర్వేదం…

ఆయుర్వేద జ్ఞానం చాలా విస్తృతం. దానిని ఔపోసన పట్టడం కంటే అభ్యాసం చేయడం మేలని ఎంచారు మన పూర్వికులు. అందుకే ఆయుర్వేదాన్ని మన నిత్యజీవన శైలిగా మార్చారు. స్నానం, పానం, ఆహారం, విహారం… ఇలా ప్రతి అంశంలోనూ మనకు తెలియకుండానే మనం ఆయుర్వేదాన్ని ఆచరిస్తుంటాం. ఇంగ్లిష్ మందులు, ఇతర ఔషధాలకు కొన్ని దుష్ర్పభావాలు ఉంటాయి. వాటినే సైడ్ ఎఫెక్ట్స్ అని అందరూ వ్యవహరిస్తుంటారు. కానీ ఆయుర్వేదంలో ఉపయోగించే పదార్థాలన్నీ స్వాభావికాలు. ప్రకృతి సహజాలు. ఉదాహరణకు మన వంటగదిలో ఉపయోగించే వాము, జీలకర్ర, దాల్చినచెక్క వంటివన్నీ ఆయుర్వేదంలో ఔషధాలే. అలాక్కాకుండా వంటింటి దినుసులుగా ఉపయోగిస్తే అప్పుడవి రోజువారీగా ఉపయోగించే పదార్థాలే. అందుకే ఆయుర్వేదం వల్ల సైడ్‌ఎఫెక్ట్స్ ఉండవు. అన్నీ సైడ్ బెనిఫిట్సే. కాబట్టే ఆయుర్వేదం మన నిత్యజీవితంలో భాగం అయ్యేలా చూశారు మన పూర్వికులు, ఆచార్యులు. అందుకే ఆయుర్వేద శాస్త్ర ప్రకారం పైసా ఖర్చులేకుండా పొందగలిగే ఆరోగ్యాన్ని స్నానం నుంచి ప్రారంభిద్దాం.

రోజులో తొలి కార్యక్రమం…వ్యాయామం

వ్యాయామం అతిగా చేయకూడదు. నుదుట చెమట రావడం మొదలు కాగానే లేదా అధికశ్రమతో శ్వాస తీసుకోవడం మొదలుకాగానే వ్యాయామాన్ని ఆపేయాలి. ఇలా చేయడాన్నే శరీర అర్ధబలమంటారు.

బాగా శరీర పరిశ్రమ (కఠిన వ్యాయామం) లేదా రన్నింగ్ లేదా వాకింగ్ చేసి వచ్చాక… వెంటనే నీరు తాగకూడదు. శరీరం, శ్వాస నెమ్మదించాక మాత్రమే నీరు తాగాలి.

వ్యాయామ, విహారాలకు అనువైనది ప్రాతఃకాలమే. ఆహారం తీసుకున్న తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యాయామం చేయకూడదు.

స్నానం…ప్రాధాన్యం..!

స్నానానంతరం మనకు కలిగే ఆహ్లాదం అంతా ఇంతా కాదు. స్నానం కేవలం శరీరాన్ని శుభ్రపరచడం మాత్రమే చేయదు. అనేక సమస్యలనుంచి సాంత్వన కలిగిస్తుందీ స్నానం. అయితే స్నానం ఆరోగ్యకరం కావాలంటే కొన్ని సూచనలు గుర్తుపెట్టుకోండి. అవి…

తలపై మరీ ఎక్కువ వేన్నీళ్లతో స్నానం వద్దు. స్టీమ్ బాత్, సౌనా బాత్ వంటివి ఆరోగ్యకరం కాదు. స్టీమ్‌బాత్, సౌనాబాత్‌లో తలకు ఆవిరి పెడతారు. అది చాలా ప్రమాదకరం.

ఏదైనా తిన్నవెంటనే స్నానం చేయకూడదు. స్నానం తర్వాతే ఆహారం తీసుకోవాలి.

కడుపు నిండా తిన్న వెంటనే స్నానం చేయవద్దు. రెండు, మూడు గంటల తర్వాతే స్నానం చేయండి.

బలహీనంగా ఉన్నవాళ్లు, వృద్ధులు మరీ ఎక్కువ చన్నీళ్ల స్నానం కాని, మరీ ఎక్కువ వేణ్ణీళ్లతో స్నానంగాని వద్దు.

చన్నీళ్ల స్నానం ఆరోగ్యకరమనే అపోహ వద్దు. గోరువెచ్చని నీళ్లే మంచివి.

తప్పనిసరి పరిస్థితుల్లో చన్నీళ్లతో స్నానం చేస్తే… దానికి ముందర చన్నీళ్లు తాగవద్దు.

చన్నీళ్ల స్నానంలో నీరు ఎంత చల్లటివైతే… స్నానం వ్యవధిని అంతగా తగ్గించడం మంచిది.

గోరువెచ్చని నీళ్లతో స్నానం ముందర కాస్తంత వ్యాయామం మంచిది.

ఏ నీళ్లతో (చన్నీళ్లు లేదా వేణ్ణీళ్లు) అయినా స్నానం తర్వాత తలనొప్పి, జ్వరం వచ్చినట్లుగా అనిపిస్తే అది మీ ఆరోగ్యానికి అంతగా సరిపడదని గుర్తుంచుకోండి.

నీరూ… ఆరోగ్యప్రదాయనే!

నీటిని మనం ఆహారంతో పాటు స్వీకరిస్తుంటాం. నీరూ ఒక ఓషధే. సరైన పాళ్లలో సరైన విధంగా తీసుకుంటే దాంతో ఎన్నో అద్భుతాలు చేయవచ్చు. ఉదాహరణకు… స్థూలకాయం ఉన్నవారు తమ బరువు తగ్గించుకోడానికి ఆచరించదగిన నీటి చికిత్స (వాటర్ థెరపీ) ఏమిటంటే… ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో మూడో వంతు ఆవిరయ్యేలా చేసి, మిగతా నాల్గో వంతు భాగాన్ని చల్లార్చి తాగితే ఊబకాయం తగ్గుతుంది. అలాగే లావెక్కాలని భావించే అతిసన్నటి శరీరం ఉన్నవారు… ఒక పాత్రలో నీటిని తీసుకుని కేవలం నాలుగోవంతు మాత్రమే ఆవిరయ్యేలా చేసి, మిగతా నీటిని చల్లార్చి తాగితే క్రమంగా ఒళ్లు చేస్తారు. ఇలా ఒకే నీరు… దాన్ని ఉపయోగించే అతి సాధారణ, అతి సులభ పద్ధతుల్లో రెండు రకాల ప్రయోజనాలను చేకూరుస్తుంది.

ప్రతి అరగంటకొకసారి వేడి నీళ్లను టీ తాగినట్లుగా రోజూ సిప్ చేస్తూ తాగుతుంటే దీర్ఘకాలంలో చాలా వ్యాధులు నయమవుతాయి. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి… కాచిన పాలనూ, కాచిన నీళ్లను మళ్లీ మళ్లీ వేడి చేయకూడదు.

అన్నపానాదులను సంస్కరించాకే ఉపయోగించాలి. ఇలాంటి సంస్కరణకు ప్రధానంగా ఉపయోగపడేది నీరే. నీళ్లు లేకుండా ఘన పదార్థాల సంస్కారం వీలు కాదు.

చాలా రోగాలకు ముఖ్యకారణం కూడా నీరే. తమ ఆవాసంగా నీటిలో ఉండే జంతుజాలం ప్రసవించే సమయంలో వెలువడే విషపదార్థాలు నీళ్లలో కరిగి రోగకారకాలు కావచ్చు. అందుకే నీటి స్వచ్ఛపరిచాకే ఉపయోగించాలి. నీటిని స్వచ్ఛపరచడం అంటే… తొలుత మంచి పరిశుభ్రమైన నిర్మల వస్త్రంతో వడగట్టడం, ఆ తర్వాత నీటిని బాగా కాచి చల్లార్చి తాగడం. ఇలా నీటిని స్వచ్ఛపరిచాకే తాగాలి.

భోజనానికి ముందు నీరు తాగితే అది మందాగ్ని రూపంలో శరీరాన్ని కృశింపజేస్తుంది. మధ్యమధ్యన నీరు తాగకుండా భోజనం తర్వాతే నీరు తాగితే అది శరీర స్థౌల్యం (ఊబకాయం) కలిగిస్తుంది. ఛాతీ, కంఠం, శిరస్సుల్లో కఫాన్ని వృద్ధి చేస్తుంది. అందుకే భోజనం మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ ఉంటే మధ్యమ స్థితి (అంటే కృశ – స్థౌల్య… ఈ రెంటినీ కలిగించేదిగా) సంభవిస్తుంది. ఇలా మధ్య మధ్యన నీరుతాగడం రస, రక్తాధి ధాతువులను సమస్థితిలో ఉంచుతుంది. ఇలా తాగిన నీరు సులభంగా, సుఖంగా జీర్ణమవుతుంది.

చల్లని నీళ్లు జీర్ణం కవడానికి 45 నిమిషాలు, వేడి నీరు జీర్ణం కావడానికి 20 నిమిషాల సమయం పడుతుంది.

దురలవాట్లనుదూరం చేసుకోండిలా…

భోజనం గురించి చాలా విషయాలు మనం తెలుసుకోవాలి. భోజనం ‘ఆత్మ’కు ఇంపుగా ఉండాలి. మంచి కవిత్వం రాయడం ఎప్పుడు సాధ్యమన్న విషయాన్ని అల్లసాని పెద్దన సరదాగా చెప్పినా ఆ మాటల్లోని వాస్తవం గమనించారా? ‘ఆత్మకింపైన భోజనం…’ తినాలంటారాయన. అలాగే అన్నం తిన్న తర్వాత కలిగే తృప్తిని వర్ణించడానికి చెప్పే మాట… ‘ఆత్మారాముడు శాంతించాడు’ అనే. అంటే ఇక్కడ తాను అనే అర్థంలో ఆత్మ అనే మాటను వాడినా… విస్తృతార్థంలోనూ ఆత్మకింపైన, ఆత్మకు మేలు చేకూర్చే భోజనమే తీసుకోవాలన్నది వాస్తవం. ఇందులో భాగంగా శరీరానికీ, నాలుకకూ రుచిగా ఉన్నప్పటికీ అది ఆరోగ్యానికి అంతగా మేలు చేసేది కానప్పుడు దాన్ని వర్జించాలి. ఇలా వర్జించే సమయంలోనూ దాన్ని అకస్మాత్తుగా వర్జించకూడదు. దురలవాటునూ, దుర్వ్యసనాన్ని దూరం చేసుకోనే సమయంలో దాని పరిమాణాన్ని రోజూ శోడశ పాద భాగాన్ని విడవాలి. అంటే ప్రతిరోజూ ఒకటిలో పదహారోవంతును తగ్గించుకుంటూ… ఇలా క్రమంగా మేలు చేయని ఆహారాన్ని వర్జించాలన్నమాట.

భోజనం తర్వాత మొక్కజొన్న కండె, మొక్కజొన్న అటుకులు తినకూడదు.

వండటానికి పనికొచ్చే కూరలను వండే తినండి…

ఇటీవల చాలా మంది పచ్చి కూరలు తినడం వల్లనే ఆరోగ్యం ఇనుమడిస్తుందంటూ చెబుతుంటారు. ఇది కేవలం పాక్షిక సత్యం మాత్రమే. వండి తినడం (పచనం చేయడం) నాగరక పరిణామక్రమంలో వచ్చిన అభివృద్ధి. అందువల్ల దాన్ని అభివృద్ధి సూచకంగానే పరిగణించాలి. క్యారెట్, బీట్‌రూట్, ఉల్లి, కీర, చిన్నపాటి అల్లం తురుము, ధనియాలు, పుదీన లాంటి వాటిని పచ్చిగా తిన్నా పర్వాలేదు. ఎందుకంటే అవి అందుకు ఉపయుక్తంగా ఉంటాయి కాబట్టి. కానీ సొర, బీర, కాకర వంటి కూరగాయలను వండి మాత్రమే తినండి. వండటానికి మాత్రమే వాటిని ఉపయుక్తంగా తయారు చేసింది ప్రకృతి. ఉదాహరణకు కూరగాయలుగా మనం వాడేవాటిలో కాకరనే తీసుకుందాం. దానికి చికిత్సాపరమైన ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయన్నది వాస్తవం. దాన్ని తింటే ఆరోగ్యానికి మంచిది, డయాబెటిస్ లాంటి దీర్ఘవ్యాధులను తగ్గిస్తుందన్నది కూడా పరమ సత్యం. అయితే అలాగని దాన్ని పచ్చిగా తినడం చాలా హానికరం. అందులో ఔషధగుణాలతో పాటు కొన్ని ఆల్కలాయిడ్స్ కూడా ఉంటాయి. అవి మోతాదుకు మించినప్పుడు శరీరానికి హాని చేస్తాయి. కాబట్టి దాన్ని పచ్చిగా తినడమో లేదా అదేపనిగా రోజూ కాకర రసం తీసుకుని తాగడమో చేస్తే దీర్ఘకాలంలో దాని దుష్పరిణామాలు అనుభవించాల్సి వస్తుంది. అందుకే కూరగాయలను, ఆకుకూరలను వండే తినండి. సలాడ్స్‌గా తీసుకోదగ్గ క్యారెట్, బీట్‌రూట్, ఉల్లి, కీర, చిన్నపాటి అల్లం వంటివాటికి మిగతా కూరలను జత చేయకండి.

పొన్నగంటికూర కళ్లకు చాలా మంచిది.

భోజనం తీసుకోండిలా…

అన్నం పరబ్రహ్మస్వరూపం. అందుకే దాన్ని గౌరవిస్తూ వీలైతే తూర్పునకు ముఖం చేసి తినండి. ఆహారాన్ని దూషిస్తూ, అశాంతితో తినకూడదు.

భోజనంలో మొదట తీపి తీసుకోండి. ఆ తర్వాత భోజనంలో హెవీఫుడ్‌గా మీరు భావించేదాన్ని తినాలి. అలా క్రమంగా భోజనం సాగుతున్న కొద్దీ హెవీ నుంచి లైట్‌కు వస్తూ ఉండాలి.

మొదట హెవీ అనే క్రమంలో నెయ్యిని తీసుకోండి. ఎందుకంటే నేతికి రెండు రకాల గుణాలుంటాయి. అది అగ్నిని ప్రజ్వలిస్తుంది. (అగ్నికి ఆజ్యం తోడైనట్లు అనేది అందుకే). అంటే మొదట అగ్నిగుణాన్ని కలిగించడం వల్ల ఆహారం జీర్ణం అయ్యేందుకు దోహదపడుతుంది. అగ్నిగుణం కలిగిన ఆ నెయ్యే… కారాలతో నాలుక భగభగలాడేప్పుడూ… ఆహారంలో కారం మంట అధికంగా ఉన్నప్పుడూ దాన్ని శాంతింపజేయడానికి తోడ్పడుతుంది. అందుకే అన్నంలో నేతికి తొలి వరస. ఈ క్రమంలో అన్నింటికన్నా తేలికైన మజ్జిగది తుది వరస.

అన్నం తినేప్పుడు కొందరు మంచినీళ్లు అస్సలు తాగరు. కానీ మధ్యలో నీళ్లు తాగడమే మంచిది. లేకపోతే మనం తీసుకునే అన్నంలోని ఘనపదార్థాలు మధ్యలో చిక్కుకుపోయి (స్తంభించి), జీర్ణక్రియకు అవరోధం కలిగిస్తాయి. అందుకే గొంతులో/ కడుపులో ఏదైనా అడ్డంపడ్డట్లు ఉన్నప్పుడు నీళ్లు తాగడమే మంచిది.

అన్నాన్ని కళ్లతో చూడగానే నోట్లో నీళ్లూరతాయి. జ్ఞానేంద్రియాలలో కలిగే స్పందనల్లో ఇదొకటి. మంచి శ్రేష్ఠమైన ఆహారం రుచులను వినగానే వాటిని రుచిచూడాలనిపిస్తుంది. ఇది మరో జ్ఞానేంద్రియం చేసే పని. ఇక ఎలాగూ నాల్క రుచిచూస్తుంది. అలాగే అన్నాన్ని స్పర్శిస్తూ తినడం వల్ల కూడా కొన్ని స్పందనలు కలుగుతాయి. అందుకే అన్నాన్ని స్పూన్లూ, ఫోర్కులూ, నైఫ్‌ల వంటి ఉపకరణాలతో తినే బదులు చేతి ఐదువేళ్లతో స్పర్శిస్తూ తినండి. ఈ స్పర్శజ్ఞానమూ మెదడులో కొన్ని స్పందనలు కలిగించి అన్నం పట్ల హితవును కలిగిస్తుంది. అయితే ఈ జ్ఞానం కలగడానికి మిగతా జ్ఞానేంద్రియాలతో పోలిస్తే కాస్త ఎక్కువ వ్యవధి పడుతుంది.

భోజనం చివరన చల్ల (మజ్జిగ) వాడటం చాలా మంచిది. దీనికి కొద్దిగా శుంఠి, సైంధవ లవణం కలుపుకుని తింటే మరింత శ్రేష్ఠం.

ఇక అన్నం తిన్న తర్వాత చేయి కడిగి… ఆ చేయి తుడుచుకున్న తర్వాత ఉండే కాస్తంత తడితో కళ్లుమూసుకుని, కన్రెప్పలను తుడుచుకుంటే కొన్ని దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఇది కళ్లకు చాలా మంచిది.

భోజనం చేయండిలా…

భోజనం చేసే సమయంలో మీ కడుపును నాలుగు భాగాలుగా ఊహించుకోండి. అందులోని రెండు భాగాలను ఘనపదార్థాలకూ, ఒక భాగం ద్రవపదార్థాలకూ, మిగతా మరో భాగాన్ని వాయువుకు విడవండి. ఈ నిష్పత్తిలో భోజనం చేయడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.

కేవలం పెరుగును మాత్రమే తినకూడదు. పెరుగు తినదలచినవారు అందులో కొద్దిగా తేనెనుగాని లేదా ఉసిరిక లేదా ముద్గయూషం (పెసరకట్టు) కలుపుకుని లేదా చిలికి తినాలి. పెరుగును యథాతథంగా రాత్రిపూట తినడం నిషిద్ధం.

పెరుగు తన గురుగుణం వల్ల శోఫ (వాపు)ను, కఫాన్ని పెంచుతుంది. అదే మజ్జిగ ఆ ప్రభావాన్ని తగ్గిస్తుంది.

ఫలాలు…ఫలితాలు

కొన్ని పండ్లు భోజనానికి ముందే తినడం మంచిది. మామిడి, కొబ్బరి, అరటి వంటి పండ్లను భోజనానికి ముందే తినాలి. (అరటి శ్రేష్టమైన పండే అయినప్పటికీ దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఇది బరువైన పండు, బరువైన ఆహారాలు ముందే తినాలి కాబట్టి దీన్ని భోజనానికి ముందే తీసుకోవడం మంచిది. లేదా మధ్యాహ్నభోజనం అయ్యాక… చాలాసేపటి తర్వాత ఈవినింగ్ శ్నాక్స్ టైమ్‌లో (ఉజ్జాయింపుగా సాయంత్రం నాలుగ్గంటల ప్రాంతంలో) తినాలి.

బొప్పాయి పండును ఖాళీ కడుపుతోనే తినాలి. అప్పుడది కడుపులోని మలినాలను తీసేస్తుంది. కడుపునిండా భోజనం చేశాక బొప్పాయి తినకూడదు.

పండ్లలో లీఛీ పండు అంత మంచిది కాదు.

ఆహారం భాగమైన పండ్ల విషయంలోనూ దేశ, కాలాత్మాది విజ్ఞానం ప్రతి ఒక్కరికీ అవసరం. కొన్ని ప్రాంతాల్లో పండేవి అక్కడి వారికి తేలిగ్గా జీర్ణమవుతాయి. అవి వారికి మంచిది. ఇక కొన్ని పండ్లూ, ఆహారాలు కొన్ని ప్రాంతాలవారికి పరాయివి. దేశకాలాలను బట్టి మనకు ఏది అనువైనదో వాటినే తీసుకోవాలి.

రోజులో చివరి కార్యకలాపం నిద్ర గురించి…

నియమానుసారంగా నిద్రపోవాలి. తద్వారా ఆరోగ్యం, పుష్టి, బలం కలుగుతాయి. అకాల నిద్ర లేదా అతినిద్ర లేదా బొత్తిగా నిద్రమానినా అది ఆయువును హరించివేస్తుంది. నిద్ర వేళలు / నిద్ర అలవాట్లు సరిగా లేకపోతే అది రోగాన్ని, కృశింపజేసే తత్వాన్ని, బలహీనతను, అజ్ఞానాన్ని, మరణాన్ని కలగజేస్తుంది.

నిద్రలేమి అనేది రోగాన్ని కలగజేస్తుంది. జ్ఞాపకశక్తిని హరిస్తుంది. సరైన నిద్ర లేకుండటం అన్నది దీర్ఘకాలంలో మనిషిని క్రమంగా కుంగదీస్తుంది.

నిద్ర వేళలన్నవి వారి వారి సౌకర్యాన్ని బట్టి మరీ ఎక్కువగానూ, మరీ తక్కువగానూ ఉండకుండా చూసుకోవాలి. అతినిద్ర, నిద్రలేమి ఈ రెండూ ప్రమాదకరమే అని గ్రహించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here