ఆస్త్మా తమకశ్వాసరోగం. ఇది కఫం, వాతం ప్రధానంగా వచ్చే వ్యాధి. దీని లక్షణాలలో ప్రధానంగా కనిపించేది శ్వాస తీసుకునేటప్పుడు పిల్లికూతలతో కూడిన ఆయాసం. ఇలా బాధపడేటప్పుడు ముఖాన్ని నేలకు చూస్తున్నట్లుగా కూర్చుంటే బాధ ఉపశమించినట్లు ఉంటుంది, అదే ఆకాశంలోకి చూస్తున్నట్లు అంటే వాలు కుర్చీలో కూర్చున్నప్పుడు తీవ్రత ఎక్కువవుతుంటుంది.
ఆస్త్మాను నివారించడానికి రోజూ ప్రాణాయామం చేయడం ఉత్తమమైన మార్గం. అలాగే ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా ‘అగస్త్య హరీతకీ రసాయన’ లేహ్యాన్ని కప్పు పాలతో చప్పరించాలి.
ఈ లేహ్యాన్ని వాడడానికి ప్రత్యేకమైన నియమాలు అవసరం లేదు, ఎక్కువ కాలం వాడినా ఇబ్బందులు ఉండవు. కాబట్టి జీవితాంతం తీసుకుంటుండవచ్చు. అదే విధంగా తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం… ఆస్త్మాతో బాధపడుతున్న సమయంలో ప్రాణాయామం కాని ఏ ఇతర యోగా ప్రక్రియలను కూడా సాధన చేయకూడదు.
ఆస్త్మా తక్షణ నివారణకు: మూడు చెంచాల ‘కనకాసవ’ ద్రావకాన్ని మూడు చెంచాల గోరువెచ్చటి నీటితో రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకోవాలి. ‘శృంగారాభ్రరస’ మాత్రలను ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి తీసుకోవాలి. వీటితోపాటు ఛాతీకి, నడుముకు కర్పూరతైలాన్ని రాసి వేడి నీటి కాపడం పెట్టాలి.
అలర్జీలను కలిగించే వాటిని గమనించి, అవి ఆహారం, దుస్తులు, కాస్మటిక్స్… ఇలా ఏవైనా సరే వాటికి దూరంగా ఉండాలి.
– డాక్టర్ విఎల్‌ఎన్ శాస్త్రి, ఆయుర్వేద వైద్యనిపుణులు
ఆస్త్మా తగ్గించే ఆహారం
కిస్‌మిస్, వాల్‌నట్స్, బొప్పాయి, ఆపిల్, పాలకూర, కాకరకాయ, గుమ్మడికాయ, అరటి (కూరగాయ), మొలకెత్తిన గింజలు, రాగులు, సజ్జలు వంటి పొట్టుతో కూడిన చిరుధాన్యం, విటమిన్ ‘సి, ఇ, బీటాకెరోటిన్’ పుష్కలంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. ఊపిరితిత్తుల పనితీరును నియంత్రించడం, మెరుగుపరడచంలో విటమిన్లు, మినరల్స్ ప్రధానమైనవి. కాబట్టి ఇవి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
బేక్‌ఫాస్ట్‌లో… పండ్లు, తేనె, కిస్‌మిస్, బెర్రీ వంటి పండ్లు, భోజనంలో… క్యారట్, బీట్‌రూట్ (పచ్చిగా తినగలిగినవి), తాజా కాయగూరలు ఉండాలి. వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఆలివ్ ఆయిల్, బాదం, సోయా, కొవ్వు తీసిన పాలు రోజూ తీసుకోవచ్చు.
ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క, ఏలకులు, జీలకర్ర, ఇంగువ, అల్లం, పసుపు వంటి సహజమైన మసాలాదినుసులు ఆస్త్మా తీవ్రతను తగ్గిస్తాయి.
ఇలా కూడా తీసుకోవచ్చు…
పసుపు కలిపిన పాలు తాగాలి. స్పూన్ పసుపులో స్పూన్ తేనె కలిపి పరగడుపున తీసుకోవాలి. ఇది ఆస్త్మా నివారణి కూడ. – పాలు లేదా టీలో అరస్పూన్ అల్లం పొడి లేదా మిరియాల పొడి వేసి తాగాలి.
ఇవి వద్దు!
పెరుగు, అరటిపండు, కమలాలు, నిమ్మ, బత్తాయి వంటి పుల్లటి పండ్లు, కూల్‌డ్రింకులు, ఊరగాయలు, స్వీట్లు, గుడ్లు, రంగులు వేసిన ఆహారం, ప్రిజర్వేటివ్స్‌తో కూడిన ఆహారం, బ్రెడ్, ఆవుపాలు. ఉప్పు తగ్గించాలి.
‘బాల్యంలో ఆహారపుటలవాట్లు పెద్దయ్యాక ఆస్త్మా రావడానికి కారణమవుతున్నాయి’ అన్న అధ్యయనాన్ని ప్రతి ఒక్కరూ గమనించి పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను చేయాలి.