VASA KOMMU ( VACHA )
వసకొమ్ము
లాటిన్ లో అకోరస్ కలమస్ అని ,సంస్కృతంలో వచ అని అంటారు.దీని చూర్ణాన్ని 250 – 500 మి.గ్రా మోతాదులో మాత్రమే వాడాలి.ఇది నీటి వనరులకు దగ్గరగా పెరుగుతుంది.దీని ఆకులు 60 సె.మీ పొడవుంటాయి.ఆకులు బాకుల మాదిరిగా కనిపిస్తాయి.వేరు దుంప పొడవుగా ఉంటుంది.పూవులు లేత అకుపచ్చ రంగులో గుత్తులుగా వస్తాయి.పండ్లు పసుపు రంగులో ఉంటాయి.దుంప లేదా వేరులో ఔషధ గుణాలుంటాయి.
1.అతిసారం / నీళ్ళవిరేచనాలు తగ్గడానికి – వసకొమ్ములు,తుంగముస్తల గడ్డలు,పసుపు,శొంఠి కొమ్ములు కచ్చాపచ్చాగా దంచి నీళ్ళకు కలిపి మరిగించి కషాయం కాచి తీసుకోవాలి. ( అష్టాంగ హృదయం,చరక సమ్హిత చికిత్సా స్థానం,అష్టాంగ సంగ్రహ చికిత్సా స్థానం )
- a . )మూర్చలు / ఎపిలెప్సీ తగ్గడానికి – బ్రాహ్మీ రసం , వసకొమ్ము ,చెంగల్వ కోష్టు వేరు ,శంఖ పుష్పి ( వేరు,ఆకులను ) పాత నెయ్యికి కలిపి ఘృతపాకం విధానంలో ఘృతం తయారుచేసి వాడితే ఉన్మాదం,మూర్చలు ,తదితర రుగ్మతలు తగ్గుతాయి. ( బృంద మాధవ ,చరకసమ్హిత చికిత్సా స్థానం,వంగసేన సమ్హిత అపస్మార అధికరణం ,సిద్ధభేషజ మణిమాల )
b.) వసకొమ్ములను చిన్న చిన్న ముక్కలుగా తరిగి వాటిని బాండీలో వేసి నల్లగా మాడేంత వరకు అట్లకాడతో కలదిప్పి దించి ,మెత్తగా దంచి జల్లెడపట్టి నిలువ చేసుకోవాలి.రోగుల వయసును బట్టి , వ్యాధి తీవ్రతను బట్టి పిల్లలకు 1 నుంచి 3 చిటికెల మోతాదుగా పెద్దలకు 1 గ్రాము నుంచి 3 గ్రాముల మోతాదుగా మంచి నీటితో కలిపి తాగుతుంటే మూర్చ వ్యాధి హరించి పోతుంది.
- ఎసిడిటీ తగ్గడానికి – వస చూర్ణాన్ని తేనె,బెల్లంతో కలిపి తీసుకుంటే అసిడిటీలో హితకరంగా ఉంటుంది.
4.శరీరపు వాపు , వృషణాల వాపు తగ్గడానికి – వసకొమ్ముల పొడిని ఆవనూనెతో కలిపి బాహ్యంగా ప్రయోగిస్తే వాపు తగ్గుతుంది.
5.చర్మ వ్యాధులు / కుష్టం తగ్గడానికి – వసకొమ్ములు , చెంగల్వ కోష్టు వేరు ,విడంగాలను మెత్తగా నూరి నీళ్ళు కలిపి ముద్ద చేసి బాహ్యంగా ప్రయోగిస్తే చర్మవ్యాధుల్లో హితకరంగా ఉంటుంది.( వంగసేన సమ్హిత , కుష్టధికారం )
6.మొటిమలు తగ్గడానికి – వసకొమ్ముల గంధం,లొద్దుగ చెక్కల గంధం ,ధనియాల పొడిని కలిపి మొహం మీద ప్రయోగిస్తే యవ్వనంలో వచ్చే మొటిమలు తగ్గుతాయి. ( వంగ సేన , క్షుద్రరోగాధికారం )
7.తలనొప్పి / అర్థశిరో వేదన తగ్గడానికి – పచ్చి వసకొమ్మును దంచి రసం పిండి ,పిప్పళ్ళ పొడిని గాని ,ఇప్పపువ్వుల రసాన్ని గాని కలిపి తేనె కూడా చేర్చి ముక్కులో నస్యం రూపంలో బిందువులుగా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.ముఖ్యంగా సూర్యావర్తం ,అర్థావభేదం వంటి తలనొప్పుల్లో ఇది అమితమైన ఫలితం చూపిస్తుంది. (సుశృత సమ్హిత ఉత్తర స్థానం, బృందమాధవ )
8.జుట్టు ఊడటం / ఎలోపేషియా తగ్గడానికి – వసకొమ్మును ,దేవదారు వేరు పట్ట లేదా గురివింద గింజలను ముద్దగా నూరి ,జుట్టు ఊడిన చోట లేపనం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.దీనికి ముందు సిరా వ్యధనం ద్వారా రక్త మోక్షణం చేయాల్సి ఉంటుంది.( అష్టాంగ హృదయం ఉత్తర స్థానం )
- a.) గాయాలు,అభిఘాతాలు,దుష్ట వ్రణాలు తగ్గడానికి – వసకొమ్ము వేసి కాచిన నీళ్ళతో వ్రణాన్ని కడిగి శుభ్రం చేస్తే తొందరగా మానుతుంది. ( సుశృత సమ్హిత సూత్ర స్థానం ).
b.) .వసకొమ్ము,పసుపు ,వాము వీటిని సమంగా తీసుకొని నీటితో నూరి తర్వాత కొద్దిగా నువ్వుల నూనె కలిపి ఉడకబెట్టి ఆ ముద్దను గోరు వెచ్చగా దెబ్బలపైన ,గాయాలపైన కట్టు కడుతూ ఉంటే అవి త్వరగా మానిపోతాయి.
10.పసిపిల్లల్లో కళ్ళు అతుక్కుపోవడం – వసకొమ్ముపొడిని తేనెతో కలిపి గాని లేదా మదన ఫలాన్ని ఇప్పపువ్వులతో కలిపి ముద్దగా నూరి గాని పిల్లలకు నాకించి వాంతిని కలిగిస్తే కళ్లు పుసులు కట్టి అతుక్కుపోవడం తగ్గుతుంది. ( అష్టాంగ హృదయం ఉత్తర స్థానం )
11.రసాయనంగా – వసకొమ్ములను వేసి ఘృతపాక విధానంలో నెయ్యిని తయారుచేసి వందసార్లు ఆవర్తం చేసి దీర్ఘకాలం పాటు వాడితే శరీరం వజ్రసమానంగా తయారవుతుంది.వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి.( సుశృతసమ్హిత చికిత్సా స్థానం )
12.మంచి జ్ఞాపక శక్తి,చక్కని కంఠ స్వరం కోసం – వసకొమ్ములను పాలలో వేసి మరిగించి కనీసం ఒక నెలపాటు తీసుకుంటే చక్కటి జ్ఞాపక శక్తి ,కోకిల లాంటి కంఠ స్వరం ,మంచి శరీర కాంతి సిద్ధిస్తాయి.సూక్ష్మ జీవులు దాడిచేయకుందా ఉంటాయి.వసకొమ్ములను ఆవునెయ్యికి కలిపి ఘృతపాక విధానంలొ నెయ్యిని తయారుచేసి వాడుకోవచ్చు ( అష్టాంగ హృదయం ఉత్తర స్థానం )
13.కడుపునొప్పి – వసకొమ్ములు ,సౌవర్చ లవణము ,ఇంగువ ,చెంగల్వ కోష్టు వేరు ,అతివిష వేరు ,కరక్కాయలు ,కొడిశపాల గింజలు ( ఇంద్రయవ బీజాలు )వీటిని కలిపి తీసుకుంటే ఉదర శూల వెంటనే తగ్గుతుంది.( సుశృతసమ్హిత ఉత్తర స్థానం )
14.అర్శమొలలు / పైల్స్ తగ్గడానికి – వసకొమ్ములను ,సోంపు గింజలను కలిపి నూరి ముద్దగా చేసి అర్శమొలలమీద ప్రయోగించాలి.దీనికి ముందు నువ్వుల నూనెను వేడిచేసి బాహ్యంగా ప్రయోగించాల్సి ఉంటుంది.( చరకసమ్హిత చికిత్సా స్థానం )
15.అజీర్ణం తగ్గడానికి – వసకొమ్ములతో తయారుచేసిన కషాయానికి సైంధవ లవణం కలిపి వాంతిని ప్రేరేపిస్తే అజీర్ణం నుంచి ఉపశమనం లభిస్తుంది .
16.మూత్ర విసర్జనను ఆపుకోవడం వల్ల వచ్చే నొప్పి తగ్గడానికి – పాలను బాగా మరిగించి ,నీల్లు , వసకొమ్ముల చూర్ణం కలిపి తీసుకుంటే నొప్పి తగ్గుతుంది ( భావ ప్రకాశం )
17.గుందె జబ్బులు తగ్గడానికి – వసకొమ్ములు , వేపచెట్టు బెరడుతో కషాయం తయారుచేసి ఇచ్చి వాంతిని కలిగిస్తే కఫప్రకోపం వల్ల వచ్చే గుండె జబ్బులు తగ్గుతాయి ( వంగసేన )
18.ఎలుక విషం విరుగుటకు – ఎలుక కాటువల్ల విష లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వసకొమ్ముల చూర్ణాన్ని బియ్యం కడుగు నీళ్లతో 3 నుంచి 7 రోజులపాటు ప్రతి రోజూ ఉదయం పూట తీసుకోవాలి.ఈ చికిత్సా కాలంలో ప్థ్యాహారాన్ని మాత్రమే తీసుకోవాలి.( గదనిగ్రహం )
19.చెవి వ్యాధులు తగ్గడానికి –
వసకొమ్ములపొడిని వెలగ పండ్ల గుజ్జుతో కలిపి వేడి చేసి చెవి తమ్మె చుట్టూ పట్టుగా వేసుకుంటే చెవిపోటు,నొప్పి,ఇతర చెవి సమస్యలు తగ్గుతాయి ( గదనిగ్రహం )
20.తలనొప్పి తగ్గడానికి – వసకొమ్మును మెత్తని ముద్దగా నూరి నుదుటి మీద పట్టు వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.
21.కీళ్ళనొప్పి ,వాపు తగ్గడానికి – వసకొమ్మును నీళ్లతో సహా మెత్తగా నూరి వాపులు,నొప్పుల మీద పట్టు వేసుకుంటే నొప్పి,వాపులనుంచి ఉపశమనం లభిస్తుంది.
22.బ్రాంఖైటిస్,న్యుమోనియా తగ్గడానికి – వసకొమ్మును నీటితో మెత్తగా నూరి చాతీ మీద పట్టు వేసుకుంటే నిమ్ము లాగేస్తుంది.
23.కలరా తగ్గడానికి – వసకొమ్మును నలగ్గొట్టి 4 గ్లాసుల నీళ్ళకు కలిపి మరిగించి వడపోసి ప్రతి పావు గంటకూ పావు గ్లాసు చొప్పున రోజుకు 3 – 4 సార్లు తాగితే కలరా వ్యాధిలో మంచి ఫలితం కనిపిస్తుంది.
24.కడుపునొప్పి,గ్యాస్ తగ్గుటకు – వసకొమ్మును నల్లగా మారేంతవరకు నిప్పుల మీద మాడ్చి కొద్దిగా ఆముదంతో గాని లేదా కొబ్బరి నూనెతో గాని కలిపి ఉదరభాగం మీద ప్రయోగిస్తే కడుపు నొప్పి ,గ్యాస్ ,ఉబ్బరింపు,గడబిడ వంటివి తగ్గుతాయి.
25.దగ్గు ,జ్వరం తగ్గడానికి – వసకొమ్ము , అతిమధురం వేరుల చూర్ణాలను ఒక్కోటి పావు చెంచా చొప్పున తీసుకొని 2 గ్లాసుల నీళ్ళకు కలిపి కషాయం మాదిరిగా మరిగించి కొద్దిగా చల్లారిన తర్వాత పూటకు పావు కప్పు మోతాదుగా మూడు పూటలా తాగితే దగ్గు,జ్వరం,కడుపు నొప్పి వంటివి తగ్గుతాయి.
26.చిన్న పిల్లల్లో దగ్గు తగ్గడానికి – ముందుగా వసకొమ్ముకు ఆముదం పూసి ,ఎండబెట్టి ,నిప్పుల మీద నల్లని బొగ్గుగా మారేంతవరకు మండించి పొడి చేసి నిల్వ చేసుకోవాలి.దీనిని 2 చిటికెల మోతాదుగా ,చెంచాడు తేనెతో కలిపి పిల్లల చేత 3 పూటలా తినిపించాలి.
- పిల్లల ఉబ్బసపు కడుపు నొప్పి తగ్గడానికి – వస కొమ్మును నీళ్ళతో అరగదీసి ఆ గంధాన్ని పొత్తి కడుపు పైన లేపనం చేస్తూ ఉంటే కడుపు నొప్పి తగ్గిపోతుంది.
- పక్షవాతం తగ్గడానికి – 1 కె.జి. వసకొమ్ములను 24 గంటల పాటు మంచి నీటిలో నానబెట్టి నీటిని తీసివేసి కొమ్ములను పొడి గుడ్డతో శుభ్రంగా తుడచి కొంచెం చితగ్గొట్టి పరిశుభ్రమైన కొత్తకుండలో వేసి ఆ ముక్కలు మునిగి పైన 2 , 3 అంగుళాల ఎత్తు వరకు మేలురకమైన పట్టు తేనె పోసి కుండకు మూత పెట్టి బట్టవేసి తాడుతో గట్టిగా గాలిపోకుండా బిగించాలి.ఆ పాత్రను గాలి తగలని చోట నెలరోజుల పాటు ఉంచాలి.
తర్వాత మూత తీసి ఊరిన వసకొమ్ములను రెండు పూటలా పూటకు 2 అంగుళాల ముక్కను బుగ్గన పెట్టుకొని కొనెం చప్పరిస్తూ ఆ రసం మింగుతుండాలి.ఇలా చేస్తూ ఉంటే పక్షవాతం ఇతర వాత రోగాలు హరించి పోతాయి.అంతే గాకుండా జ్వరాలు వచ్చే రుతువులో ముందుగానే రోజూ ఒక పూట ఈ ముక్కను చప్పరిస్తూ ఉంటే మశూచికం,అంటు జ్వరాలు,కలరా,అతిసారం సోకదు.అన్ని రకాల దగ్గులు తగ్గిపోతాయి.
29.పిల్లల రొమ్ము పడిశం హరించుటకు – వసకొమ్మును నీటితో అరగదీసి ముక్కుపైన రాస్తుంటే పడిశం తగ్గుతుంది.
30.మాటలు రాని పిల్లలకు – పైన తెలిపిన విధంగా మంచినీటిలో శుద్ధిచేసిన కొమ్ములను సానరాయిపైన నీటితో అరగదీసి చిటికెడు గంధం 2,3 బొట్లు తేనె కలిపి పిల్లల చేత నాకిస్తుంటే మాటలు త్వరగా వస్తాయి.
31.మొలల బాధ వెంటనే తగ్గుటకు – వసకొమ్ములను నిప్పులపైన వేసి ఆ పొగను మొలల పిలకలకు తగిలేలా చేస్తుంటే మొలల పోటు ,తీపు వెంటనే తగ్గుతుంది.
32.కడుపులో నులి పురుగులు హరించుటకు – శుద్ధి చేసిన వసకొమ్మును మెత్తగా దంచి జల్లెడ పట్టి 1 గ్రాము పొడి 1 చెంచా తేనెతో కలిపి రెండు పూటలా తింటుంటే ఉదరములోని , ప్రేవులలోని వివిధ రకాల క్రిములు హరించిపోతాయి.
- మొటిమలు హరించుటకు – వసకొమ్ము,ధనియాలు,లొద్దుగ చెక్క వీటిని సమభాగాలుగా తీసుకుని కలిపి పొడి చేసుకుని రాత్రివేళ తగినంత పొడిలో నీరు కలిపి మెత్తగా నూరి మొటిమలపైన లేపనం చేసి ఉదయం చల్లని నీటితో కడుగుతుంటే మొటిమలు తగ్గుతాయి.
34.పిల్లలకు ఆయుర్మాత చూర్ణం – నీటిలో ఒకరోజు నానబెట్టి ఎండబెట్టిన వసకొమ్ములు , అడ్డసరపు ఆకు,సరస్వతి ఆకు,దోరగా వేయించిన శొంఠి ,వేయించిన పిప్పళ్ళూ,చెంగల్వ కోష్టు,అతిమధురం,సైంధవ లవణం,వీటిని సమంగా తీసుకోవాలి.విడివిడిగా దంచి జల్లెడపట్టి మొత్తం కలిపి పలుచని బట్టలో వస్త్రగాళితం చేసి నిలువ ఉంచుకోవాలి.
పిల్లలకు పూటకు చిటికెడు పొడి మోతాదుగా పావుచెంచా తేనె కలిపి తినిపిస్తుంటే క్రమంగా ప్రతిభాపాటవాలు,జ్ఞాపక శక్తి ,ధారణ,ప్రజ్ఞ ,దేహ సౌందర్యం పెరుగుతాయి.